తరుణ్ మృతిపై ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా

జనం న్యూస్ 29 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తరుణ్ ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ (పి డి యస్ యూ ) జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు.విద్యార్థి ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ లెక్చరర్‌పై వెంటనే కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలని ఆయన కోరారు. అలాగే తరుణ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. తరుణ్ మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థి మరణ ఘటనపై న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు.