తాళ్లరాంపూర్ దివంగత సర్పంచ్ బెజ్జారం పావనికి అశ్రునివాళి..

జనం న్యూస్ జూలై 23 : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్‌గా ప్రజల మన్ననలు పొందుతూ గ్రామాభివృద్ధికి అంకితభావంతో సేవలందించిన దివంగత బెజ్జారం పావని అకాల మరణం గ్రామ ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆమె సేవలను చిరస్మరణీయంగా నిలుపుతూ గురువారం గ్రామ సచివాలయం ఆవరణలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ నిర్వహించి భావోద్వేగ నివాళులు అర్పించారు.సంతాప సభలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు, వివిధ వర్గాల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పావని గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పదవి ప్రజాసేవకు ఒక వేదిక అనే భావనతో పావని గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. ఆమె సాదాసీదా వ్యక్తిత్వం, ప్రజలతో ఆప్యాయంగా మెలిగే తీరు, గ్రామ సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధి ఆమెను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయని పేర్కొన్నారు.పావని మరణం తాళ్లారాంపూర్ గ్రామానికి తీరని లోటని, ఆమె లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ గ్రామాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.చివరగా గ్రామస్థులంతా ఒకే వేదికపై ఏకమై దివంగత సర్పంచ్ బెజ్జారం పావనికి ఘన నివాళులర్పించడం గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. అలాగే ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు