నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ ఆందోళనమోదీ దిష్టిబొమ్మ దహనం.. నేతల అరెస్టు.. వివేకానందనగర్‌లో ఉద్రిక్తత
జనం న్యూస్ | జూలై 24 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కూకట్‌పల్లి వివేకానందనగర్ కమాన్ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు చిరుమర్తి రాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఘటన అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో వివేకానందనగర్ కమాన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పారదర్శక విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.