“ప్రశ్నించే గొంతులను అణచివేయడం బీజేపీ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం – ముప్పు శ్రీనివాస్”
జనం న్యూస్ జులై 23 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద NEET పేపర్ లీక్ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను, అలాగే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను అడ్డుకోవడం, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశ యువత భవిష్యత్తును నాశనం చేసిన NEET పేపర్ లీక్‌పై ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేయడానికే పోలీసు బలగాలను ఉపయోగిస్తోంది” అని మండిపడ్డారు.”లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ విద్యార్థులు, యువత, నిరుద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాంటి నాయకుడిని అడ్డుకోవడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున చేసే పోరాటాన్ని ఎలాంటి నిర్బంధాలతోనూ ఆపలేరు” అని పేర్కొన్నారు.NEET పేపర్ లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపైనే లాఠీలు ప్రయోగించడం అత్యంత దురదృష్టకరమన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే NEET పేపర్ లీక్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ముప్పు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.