.రైతు వేదికలో విత్తన మేళా నిర్వహణ – ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు, జలసిరి పథకంపై రైతులకు అవగాహన
జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో పప్పుధాన్యాలు, కూరగాయల పంటల విత్తన మేళా నిర్వహించి రైతులకు ఎల్‌నినో ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు జలసిరి పథకం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై కంది, పెసర విత్తనాలు ఎల్‌నినో పరిస్థితులకు అనువైన వివిధ రకాల కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచారు.
హార్టికల్చర్ అధికారి మనోహర్ మాట్లాడుతూ, ఎల్‌నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావంతో ఈ ఖరీఫ్‌లో వర్షపాతం అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని సూచించారు. తక్కువ నీటి అవసరం ఉన్న కూరగాయల పంటలు, ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు వివరించారు. అనంతరం ఎంపీడీవో ఫణీంద్ర మాట్లాడుతూ, భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటి సంరక్షణ ప్రతి రైతు బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి అనే సందేశంతో జలసిరి పథకం ద్వారా ఫామ్ పాండ్లు, రీచార్జ్ వెల్స్ ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మలచుకోవాలని సూచించారు. 12×12 మీటర్లు (2 మీటర్ల లోతు) లేదా 20×20 మీటర్లు (2.5 మీటర్ల లోతు) పరిమాణంలో ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి గల రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, జాబ్ కార్డు జిరాక్స్‌లతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) లేదా ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని కోరారు.మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, జొన్న, సజ్జ, రాగి వంటి స్వల్పకాలిక, తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. మండలంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకొని అదనపు విత్తనాల అవసరం ఉన్న రైతులు తమ సంబంధిత క్లస్టర్ ఏఈఓ లను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణీంద్ర, పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్, మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, హార్టికల్చర్ అధికారి మనోహర్, నీటిపారుదల శాఖ ఏఈ సందీప్, ఏపీఓ శాయంపేట, ఏపీఎం శాయంపేట, వసంతాపురం, హుస్సేనిపల్లి గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వ్యవసాయ విస్తరణ అధికారులు అన్వేష్, అక్షర, సానియా, హెచ్‌ఈఓ దేవేందర్, విత్తనాలు, ఎరువుల డీలర్లు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు…