శాంతినగర్ గ్రామానికి ఎన్హెచ్-563పై యూ-టర్న్ బ్రిడ్జి నిర్మించాలని శాంతియుత నిరసన
జనం న్యూస్ జులై 28 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )ఎల్కతుర్తి, జూలై 28: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థులు మంగళవారం జాతీయ రహదారి ఎన్హెచ్-563పై గ్రామానికి యూ-టర్న్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
శాంతినగర్ గ్రామ సర్పంచ్ బాసాని మేరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు సుమారు 200 మంది పాల్గొన్నారు. గ్రామానికి సమీపంలో పాఠశాల, విద్యుత్ సబ్స్టేషన్ ఉండటంతో పాటు రైతుల వ్యవసాయ భూములు జాతీయ రహదారికి ఉండటంతో ప్రతిరోజూ రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.జాతీయ రహదారిపై సురక్షితమైన యూ-టర్న్ లేదా బ్రిడ్జి లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని, ముఖ్యంగా విద్యార్థులు, రైతులు ప్రాణాలను పణంగా పెట్టి రహదారి దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి శాంతినగర్ గ్రామానికి యూ-టర్న్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొని తమ నిరసనను శాంతియుతంగా తెలియజేశారు.