సాహితీ గోదావరి కవితల పోటీలో కాట్రేనికోన కవి చింతా రాంబాబుకు ద్వితీయ బహుమతి
జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)సాహితీ గోదావరి సాహితీ సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలో కాట్రేనికోనకు చెందిన కవి, ఉపాధ్యాయుడు చింతా రాంబాబు ద్వితీయ స్థానం సాధించారు.ఆయన రాసిన “ఊటబావులు” అనే కవితకు ద్వితీయ బహుమతిగా 1016 రూపాయల నగదు బహుమతి లభించింది. గ్రామీణ జీవితం, ప్రకృతి అందాలను చక్కగా వర్ణించిన ఈ కవిత న్యాయ నిర్ణేతల మన్ననలు పొందింది.ఈరోజు కాకినాడ అచ్యుతాపురంలోని ఒక ప్రైవేటు కార్యాలయంలో జరిగిన సాహితీ గోదావరి ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో విజేతలను ఘనంగా సన్మానించారు. కవిత, కథ, వ్యాస పోటీల్లో గెలిచిన వివిధ జిల్లాల సాహితీవేత్తలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సాహితీ గోదావరి సాహితీ సంస్థ వ్యవస్థాపకులు ర్యాలి శ్రీనివాస్, ప్రముఖ కథా రచయిత భమిడిపాటి గౌరీశంకర్, దుబ్బ శ్రీరామమూర్తి, చాగంటి సుబ్రహ్మణ్యం, ఆర్ వి వి రాజా, గరగ రామకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 60 మంది తెలుగు కవులు పాల్గొన్నారు.సభలో వక్తలు మాట్లాడుతూ తెలుగు సాహిత్య అభివృద్ధికి సాహితీ గోదావరి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కొత్త తరం కవులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.కాట్రేనికోనకు చెందిన చింతా రాంబాబు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే సాహిత్య రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో కూడా పలు కవితా పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. ఆయన విజయంపై స్థానిక సాహితీ ప్రియులు, ఉపాధ్యాయులు అభినందన తెలిపారు