తెలంగాణ

రాంబిల్లి సెజ్ పరిధిలో గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

రాంబిల్లి సెజ్ పరిధిలో గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

జనం న్యూస్, అక్టోబర్05,అచ్యుతాపురం : రాంబిల్లి సెజ్ పరిధిలో నూతనంగా నిర్మించిన 220/132/33 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీ ఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు కలిసి ప్రారంభించారు.అచ్యుతాపురం సెజ్ పరిధిలోని పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ నూతన విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ సబ్‌స్టేషన్ కీలకంగా ఉపయోగపడనుంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నూతన పరిశ్రమలకు అవకాశాలు కల్పించడంతో పాటు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్లపై తగిన శ్రద్ధ చూపలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన విద్యుత్ సబ్‌స్టేషన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పునరుద్ధరించి, పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పరిశ్రమల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్