జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలా పురం: కిమ్స్ కోనసీమ ఆసుపత్రి ఆధ్వర్యంలో చైతన్య గ్రూప్ చైర్మన్ చైతన్య రాజు, కిమ్స్ నిర్వాహకులు రవి వర్మ నిర్వహించిన స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రికి చెందిన 3,600 మంది విద్యార్థులు, సిబ్బంది పాల్గొని పట్టణంలోని 36 వార్డుల్లో పారిశుధ్య పనులు చేశారు. ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రతి ఇంటికి ఒక జనపనార సంచిని ఉచితంగా ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. స్వచ్ఛతలో అమలాపురంను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కిమ్స్ కృషి చేస్తోందని చైతన్య రాజు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, చెత్తను రోడ్లపై వేయవద్దని, బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టవద్దని సూచించారు. పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కిమ్స్ ప్రతినిధులు, వైద్యులు, మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.