జనం న్యూస్ అక్టోబర్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లిలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా, నయనమనోహరంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయ నృత్యాలు, దాండియా ప్రదర్శనలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డా. కొరదల నరేష్ విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయంగా మారాలని ఆకాంక్షించారు. కళాశాల డైరెక్టర్ కొరదల లావణ్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బి.ఎస్. రాజేష్, మేనేజర్ రాజేశ్వరరావు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది సమన్వయంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తూ దాండియా, జానపద నృత్యాలను ప్రదర్శించారు. ఆటపాటలు, ఉత్సాహభరితమైన కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. సంప్రదాయాల పరిరక్షణ, సాంస్కృతిక ఐక్యతను చాటిచెప్పిన ఈ బతుకమ్మ వేడుకలు విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపాయి.