తెలంగాణ

ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు సొంత నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు సొంత నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

మూసాపేట్ పరిసర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు జనం న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఖైతలపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు చొరవ తీసుకొని తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మూసాపేట్ పరిసర ప్రాంతంలో ఒక ప్రైవేట్ సంస్థ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన సమయంలో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రోడ్డు నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించింది. అయితే, తమ నిర్మాణాలు పూర్తయిన తర్వాత రోడ్డు నిర్మిస్తామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ, సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తికాకపోవడంతో పాటు రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, మూసాపేట్ ప్రధాన రహదారిపై రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో వాహనదారులు, స్థానిక నివాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులను సంప్రదించగా, ప్రస్తుతం నిధులు అందుబాటులో లేనందున రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోతున్నామని అధికారులు తెలిపినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు తమ సమస్యను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆంజనేయ నగర్, ప్రగతి నగర్, శ్రీహరి కాలనీ, పవర్ నగర్, శక్తి నగర్ ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని వివరించారు.దీనిపై స్పందించిన రాజేశ్వరరావు ఈరోజు సంబంధిత ప్రాంతానికి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి రోడ్డు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత నిధులతో ప్రస్తుతం ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని ఈ సందర్భంగా రాజేశ్వరరావు చొరవ మరోసారి చాటిచెప్పింది. తాత్కాలిక రోడ్డు నిర్మాణం జరిగి, ఆయా కాలనీల ప్రజలకు శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య నుంచి స్థానిక ప్రజలకు ఉపశమనం లభించడంతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఖైతలాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు ఐలయ్య, కొడిచర్ల వినోద్, పండుగ రేణుక,ఈ. సాయి, శ్రీనివాస్ చారి, చక్రి, స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్