ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై BJYM ధర్నా

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై BJYM ధర్నా

బిచ్కుంద అక్టోబర్ 17 జనం న్యూస్వి ద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా BJYM జిల్లా జనరల్ సెక్రటరీ బుడాల గంగరాజు మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం. ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. “హామీలు కాదు.. ఉద్యోగాలు కావాలి. మాటలు కాదు.. నియామకాలు కావాలి” అని ఆయన డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని, నిరుద్యోగుల సమస్యలపై వెంటనే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే BJYM ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బుడాల గంగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BJYM జిల్లా సెక్రెటరీ మారుతి, చంద్రకాంత్ పాటిల్, మల్లు దేశాయ్, లక్ష్మణ్ చారి, సంజు పటేల్, పస్కే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్