జనం న్యూస్ :- అమెరికా–మెక్సికో సరిహద్దు ప్రాంతంలో వింత జీవి కనిపించిందంటూ ప్రచారం జరుగుతోంది. మెక్సికోలోని చిహువాహువా రాష్ట్రం, వ్యాలీ ఆఫ్ జువారెజ్ ప్రాంతంలో ఈ జీవి గోడ ఎక్కుతున్నట్లు కనిపించే కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోళ్లు, కుందేళ్లు కనిపించకుండా పోతున్నాయని స్థానికులు చెబుతున్న నేపథ్యంలో ఈ చిత్రాలు ఆసక్తితో పాటు అనుమానాలనూ రేకెత్తిస్తున్నాయి.
వైరల్ చిత్రాల్లో పొడవాటి తోక, నాలుగు కాళ్లు ఉన్నట్లు కనిపించే ఓ జీవి పెద్ద ఇటుక గోడను ఎక్కుతున్నట్లు ఉంది. దాని పొడవు సుమారు ఆరు అడుగులు, తోక మూడు అడుగుల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. యూఎఫ్ఓలపై ఆసక్తి చూపించే పరిశోధకుడు జైమ్ మౌస్సాన్ బృందం ఈ చిత్రాలను విడుదల చేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ జీవి నిజంగా ఏ జంతువో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
ఈ జీవి వెనుక కాళ్లపై నడుస్తుందని, వేగంగా కదులుతుందని కొందరు చెబుతున్నారు. స్థానికుల కథనాల ఆధారంగా అది కోడిని పట్టుకుని చెట్టుపైకి ఎక్కిందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ వాదనలకు స్వతంత్ర ఆధారాలు అందుబాటులో లేవు. మరోవైపు, వైరల్ చిత్రాలు కృత్రిమ మేధస్సు (AI) సాయంతో సృష్టించినవై ఉండవచ్చని కొందరు నెటిజన్లు అనుమానిస్తున్నారు.
దీంతో ఇది కొత్త జాతికి చెందిన జంతువా, ఇప్పటికే తెలిసిన ఏదైనా జంతువా, లేక డిజిటల్‌గా సృష్టించిన చిత్రమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు ఏలియన్ అంటూ ఊహాగానాలు చేస్తున్నప్పటికీ, గ్రహాంతర జీవి అని నిర్ధారించడానికి ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. చిత్రాల అసలుదనం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వస్తేనే ఈ మిస్టరీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.