జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే నూతన ఇల్లు నిర్మించి 25 లక్షలు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు అఖిలపక్ష కమిటీ వినతి
జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లె గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేసిన ఘటనపై అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇంటి కూల్చివేతకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్‌ను కోరారు.దళిత కుటుంబానికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి, బాధితులకు నూతన పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వడంతో పాటు 25 లక్షలు తగిన నష్టపరిహారం అందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దళితుల హక్కులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా సామాజిక చైతన్య కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు పెంపొందించాలని తగిన రక్షణ కల్పించాలని దీనికోసం సమాజంలో అవగాహన ఉన్నటువంటి ప్రజాసంఘాలు సామాజిక సంస్థలు స్వచ్ఛత సంస్థలు న్యాయవాదులు టీచర్ల ద్వారా నిరంతరాయంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి, బహు జన రాజ్య సమితి నాయకులు వినోద్, కోళ్ల హుస్సేన్,వాల్మీకి బి ఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య, అవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు అతికూర్ రెహ్మాన్,టీపీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్. సిఎల్సి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుభాన్ బి ఆర్ యస్ గంజిపేట రాజు,సిపిఐ ఎంఎల్ బీరవెల్లి దానయ్య, భీమ్ ఆర్మీ మాచర్ల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.