ఆంధ్రప్రదేశ్

మారుమూల పల్లె నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు-భవ్య శ్రీ అద్భుత ప్రయాణం

మారుమూల పల్లె నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు-భవ్య శ్రీ అద్భుత ప్రయాణం

జనం న్యూస్ అక్టోబర్ నాలుగు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కలలో కూడా ఊహించలేని అనుభూతులు ఎన్నటికీ మరిచిపోలేనని మారుమూల పల్లె నుంచి ఢిల్లీకి వెళ్లిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఉండ్రాజవరపు భవ్య శ్రీ జ్యోత్స్న అన్నారు. ఉన్నత పాఠశాలలో రూపొందించిన మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ ప్రాజెక్టుకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంతో ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రం తరఫున ఎంపికైంది.అక్టోబర్ 02న గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పార్లమెంటు భవనంలో కేంద్ర విద్యాశాఖ, యువజన శాఖలు ప్రైడ్ సంస్థ సహకారంతో నిర్వహించిన మీ నాయకుడిని తెలుసుకోండి కార్యక్రమంలో 108 మంది బాలమేధావులతో కలిసి పాల్గొంది. ప్రాజెక్ట్ గైడ్ టీచర్, హెచ్ఎం గుబ్బల నాగ సత్యనారాయణతో కలిసి పార్లమెంటులో అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాగా స్పీకర్ ఓం బిర్లా నిర్వహించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా,రాజ్ నాథ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను ఒకే చోట చూడటం, వారితో గడపడం మరిచిపోలేనని భవ్య శ్రీ తెలిపింది. విమానం ఎక్కుతానని, ప్రధాని పక్కన నిలబడి అభివాదం చేస్తానని కలలో కూడా ఊహించలేదని, పార్లమెంట్ విందు, ఇండియా గేట్, అమర జవాన్ స్థూపం, మ్యూజియం చూశానని, పాత కొత్త పార్లమెంటు భవనాల మధ్య ఫోటో తీయించుకోవడం పూర్వజన్మ సుకృతమని భావోద్వేగంతో చెప్పింది.

ఇ-పేపర్