ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలి

సీఎం చంద్రబాబు ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలి

జనం న్యూస్, అక్టోబర్ 06, అచ్యుతాపురం : ఇటీవల సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, తుపాను పరిస్థితుల వల్ల జీవనోపాధి కోల్పోయిన తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని జిల్లా మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు,వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మిడి అప్పారావు లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పూడిమడక గ్రామ మత్స్యకారులతో కలిసి అచ్యుతాపురం మండలం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ రాకేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు మాట్లాడుతూ. రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకతో పాటు తంతడి, ముత్యాలమ్మ పాలెం, తిక్కవానిపాలెం, లోవపాలెం, గజ్జిరెడ్డిపాలెం, వెంకయ్యపాలెం, వాడ రాంబిల్లి, వాడనర్సాపురం, కొత్తపట్నం, బంగారమ్మ పాలెం, రేవు పోలవరం తదితర తీర ప్రాంత గ్రామాల్లోని వేలాది కుటుంబాలు పూర్తిగా సముద్రపు వేటపైనే ఆధారపడి బతుకుతున్నాయని తెలిపారు. గత నెలలో వారం రోజుల పాటు వేట బంద్ కావడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, గత నెల 25న మీడియా ద్వారా ఈ దీనస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించి పది రోజులు దాటినా, క్షేత్రస్థాయిలో నేటికీ ఏ ఒక్క గ్రామంలోనూ పంపిణీ ప్రారంభం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తుపాను సమయాల్లో ప్రకటించిన బియ్యం లబ్ధిదారులకు నేటికీ అందలేదని, ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడం లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తహశీల్దార్ తక్షణమే స్పందించి,ఉన్నతాధికారులతో మాట్లాడి మత్స్యకార కుటుంబాలకు అందవలసిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూడిమడక గ్రామ మత్స్యకారలు వాసుపల్లి రమణ, ఏరిపిల్లి అప్పన్న, కొండ్ల గణేష్, మద్దిల ప్రసాద్, ఈరిగిల వెంకటరావు లు పాల్గొన్నారు.

ఇ-పేపర్