ఆంధ్రప్రదేశ్

అక్రమ ఎర్రరాయి తవ్వకాలను అరికట్టి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం

అక్రమ ఎర్రరాయి తవ్వకాలను అరికట్టి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం న్యాల్కల్, అక్టోబర్ 09: 10. 2026 న్యాల్కల్ మండలం గణేష్‌పూర్ గ్రామ పరిధిలో జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలి కోసం ప్రభుత్వం రైతుల వద్ద భూములు స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించిన ఆ భూముల్లో మళ్లీ అక్రమ ఎర్రరాయి తవ్వకాలు ప్రారంభమయ్యాయని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం అన్నారు. గతంలో అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించి భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అదే ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 7, 10, 25, 82 లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరి అండదండలతోనే ఈ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన కొందరు అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరించడం సరైంది కాదని, ఎర్రరాయి తవ్వకాల వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శబ్ద కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తే వారితో కుమ్మక్కైనట్లు అనిపిస్తోందని అన్నారు. ఎర్రరాయి తవ్వకాలు, తరలింపుల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలను ప్రశ్నించే వారిని భయపెడుతున్న వారిపై విచారణ జరపాలని కోరారు. జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలి భూముల్లో జరుగుతున్న అక్రమ ఎర్రరాయి తవ్వకాలను వెంటనే నిలిపివేసి, గతంలో ఏర్పాటు చేసిన కంచెను ఎవరు తొలగించారు, మళ్లీ తవ్వకాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్