
జనం న్యూస్ అక్టోబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. రామచంద్రపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, బీసీ ఐక్యవేదిక నాయకుడు పెండ్ర రమేష్ హాజరయ్యారు. తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అనే అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఎన్టీఆర్ 20% రిజర్వేషన్లు తెస్తే చంద్రబాబు 34% కి పెంచారని, వైసీపీ హయాంలో 24% కి తగ్గించి ఇప్పుడు చట్టబద్ధతకు అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రూ.250 కోట్లతో 65% పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇరిగేషన్, బ్రిడ్జిలకు రూ.3,000 కోట్లు కేటాయించామని, సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మానవసేవే మాధవసేవ స్ఫూర్తితో పేదల సంక్షేమమే లక్ష్యంగా ఫౌండేషన్, సీఎస్ఆర్ నిధుల ద్వారా సేవ చేస్తున్నామని తెలిపారు. కూటమి నిర్ణయాలకు కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దంగేటి గౌరీశంకర్, మేడిశెట్టి సూర్యనారాయణ, సనపల ధనరాజు, వనుం వీరబ్రహ్మం, కుడుపూడి ఫణితేజ తదితర బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.