జనం న్యూస్ 11 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్చే నేత పథకాలకు నిధులేవి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారుశ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలంటున్న చేనేత కార్మికులు జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టడం స్వాగతించదగిన విషయమే. అయితే ఏదైనా సంక్షేమ పథకాన్ని ప్రారంభించే ముందు దానికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించి నిరంతరంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా ముందుగా ఆర్భాటంగా అట్టహాసంగా పథకాలను ప్రారంభించి, ఆ తర్వాత నిధులు విడుదల చేయకుండా మధ్యలోనే నిలిపివేయడం వల్ల లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంటోందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలు నిధుల కొరతతో ఆశించిన స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు త్రిఫ్ట్ ఫండ్ పథకం::- 2025 మార్చిలో రెండేళ్ల కాలపరిమితితో ప్రారంభించిన ఈ పథకానికి ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేయలేదని కార్మికులు వాపోతున్నారు. కార్మికులు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ, ప్రభుత్వ సహకారంతో ఆర్థిక భరోసా పొందాలనే ఆశతో ఈ పథకంలో చేరారు. కానీ నిధుల విడుదల లేకపోవడంతో వారి ఆశలు నీరుగారుతున్నాయని అంటున్నారు. చేనేత భరోసా పథకం: 2024లో ప్రారంభించిన ఈ పథకానికి సైతం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల జరగలేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత బీమా పథకం:- జియో ట్యాగింగ్ కలిగిన, త్రిఫ్ట్ ఫండ్ పథకంలో ఉన్న అర్హులైన చేనేత కార్మికులకు వయోపరిమితితో సంబంధం లేకుండా బీమా సదుపాయం కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడంతో బీమా సదుపాయం నిలిచిపోయిందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రకటించేటప్పుడు చూపించే ఉత్సాహం, వాటి అమలులోనూ కనిపించాలి. ఒకటి, రెండు నెలలు మాత్రమే ప్రీమియం చెల్లించి ఆ తర్వాత చేతులెత్తేయడం, నిధులు కేటాయించకుండా పథకాలను కాగితాలకే పరిమితం చేయడం వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
బహిరంగ సభల్లో అట్టహాసంగా ప్రకటించిన పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్మికులు నిధుల విడుదల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు ముందు నిధులు ఆ తర్వాతే పథకాలు ఇదే ప్రభుత్వాల విధానంగా ఉండాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినా దానికి అవసరమైన పూర్తి స్థాయి బడ్జెట్ను ముందుగానే కేటాయించి పథకం నిరంతరాయంగా అమలయ్యేలా కార్యాచరణ రూపొందించాలి. కేవలం ప్రకటనలకే పరిమితమై మధ్యలో పథకాలను నిలిపివేయడం ప్రజల్లో ప్రభుత్వాలపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలు చేనేత కార్మికుల సమస్యలపై స్పందించి త్రిఫ్ట్ ఫండ్, చేనేత భరోసా పథకాలకు అవసరమైన నిధులు కేటాయించి విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని చేనేత బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఓట్ల కోసం హామీలు ప్రచారం కోసం పథకాల ప్రకటనలు కాకుండా కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికుల కుటుంబాలకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.