ఆషాడ శుక్రవారం మావుళ్ళమ్మకి విశేషాలంకరణ
జనం న్యూస్ ఆగస్టు 9 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోనలో వేంచేసి ఉన్న మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి ఆషాడ మాసం 4వ శుక్రవారం సందర్భంగా పసుపు కొమ్ములు, పూలమాలలతో విశేషాలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలిత విఘ్నేశ్వరుని పూజ, అమ్మవారికి అభిషేకం, శ్రీ సూక్త విధానంలో సహస్రనామ కుంకుమార్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నీరాజనం, మంత్రపుష్పం, వేద స్వస్తి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా లలితా సహస్ర పారాయణం చేశారు. ఆలయ ఆవరణలోని వినాయకుడు, షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు బంగారు కిషోర్, గిరిజ దంపతుల ఆధ్వర్యంలో పులిహోర ప్రసాద వితరణ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి పూజా విధానాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి పల్లకి సేవ, ఆలయం చుట్టూ 11 ప్రదక్షణాలతో ధూప సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
