నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి

June 9, 2026 | ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆందోళన కలిగిస్తున్న వరుస ప్రమాదాలు

జనం న్యూస్ జూన్ 9 అనకాపల్లి రిపోర్టర్ కృష్ణ : విశాఖపట్నం* రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ( ఆర్ఐఎన్ఎల్ ) యాజమాన్యం నిర్లక్ష్యానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరోమారు పెను ప్రమాదం చోటుచేసుకుందని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రాథమికంగా అందించిన సమాచారం ప్రకారం 8 మంది చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.అడపా దడపా విశాఖ ఉక్కులో ప్రమాదాలు జరుగుతున్నా లోపాలను సరిదిద్దడంలో యాజమాన్యం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని తాజా గా జరిగిన ప్రమాదం బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.కర్మాగారంలో భద్రతా లోపాలు, సిబ్బంది కొరత, తగిన తర్ఫీదు పొందని కాంట్రాక్ట్ కార్మికులతో, కాలం చెల్లిన విడిభాగాలు, తాత్కాలిక మరమత్తులతో నేడు ప్లాంటు నిర్వహించడతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదం తో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరంతర ఉద్యమం మేరకు పలువురి ప్రాణత్యాగాల ఫలితంగా విశాఖలో స్టీల్ ప్లాంట్స్ స్థాపన జరిగింది.1991 నుండి రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్, విశాఖపట్నం పేరుతో ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తుల ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఈ స్టీల్ ప్లాంట్ మునుగడే ప్రశ్నార్ధకంగా మారింది. కార్మికుల్లో, ఉద్యోగుల్లో సంస్థ ప్రైవేటీకరిస్తారనే భయాలు తొలగిపోలేదు. మరోపక్క ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం జరిగిన ఘోర దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.విశాఖ ఉక్కు కర్మాకారంలోని స్టీల్ ప్లాంట్ మెల్ట్ షాప్ (ఎస్ యం యస్-1 ) లో హఠాత్తుగా దాదాపు 1600 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో సలసల మరిగే 150 టన్నుల ఉక్కు ద్రవాన్ని తరలిస్తున్న లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోవడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడికక్కడే ఎనిమిది మంది కార్మికులు తప్పించుకోలేక సజీవ దహనం అయ్యారు. అనేకమంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ విశాఖపట్నం లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్టీల్ ప్లాంట్లో ఇప్పటి వరకు అనేక ప్రమాదాలు చోటుచేసుకుని వందలాది మంది కార్మికులు ప్రమాదాల్లో సమిధులయ్యారు, ఈ ప్రమాదాల కారణంగా ఉక్కు పరిశ్రమకు దాదాపు 20 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంచనా . వీటిని ఒకసారి లోతుగా పరిశీలిస్తే స్టీల్ ప్లాంట్లో భద్రత ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతుంది . దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్లాంట్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆనాడు పరిశ్రమల శాఖ డైరెక్టర్ ప్రత్యేక అధ్యయనం జరిపి, స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగకుండా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ యజమాన్యానికి నివేదిక అందించారు. నివేదిక ను అనుసరించి తగు చర్యలు సకాలంలో లేకపోవడంతో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.2012 జూన్ 13 న మిల్లింగ్ షాపు-2 లో భారీ పేలుడు సంభవించి 19 మంది విగతజీవులయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇప్పటివరకు 2012లో జరిగిన ప్రమాదమే పెను దుర్ఘటన. ఈ ప్రమాదం నుండి యాజమాన్యం గుణపాఠాలు నేర్వని పరిస్థితిలో 2014 నుంచి 2026 వరకు పలు సార్లు ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు తూతూ మంత్రంగా జరుగుతాయన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఇచ్చిన నివేదికలు కాగితాలకే పరిమితం అవుతాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒకప్పుడు 18 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు, కార్మికులు ఉండేవారు. కారణాలు ఏమైనా పదవీ విరమణ, స్వచ్ఛంద పదవీ విరమణ , ఖచ్చితమైన పదవీ విరమణ ఇలా వివిధ కారణాలతో నేడు శాశ్వత కార్మికులు, ఉద్యోగుల సంఖ్య సగం కంటే తక్కువ ఎనిమిది వేల లోపు సంఖ్యకు చేరింది. దీనికి తోడు దాదాపు 6000 మంది ఒప్పంద కార్మికులను సైతం తొలగించారు. పేరుకు పెద్ద స్టీల్ ప్లాంట్ అయినా నామమాత్రపు కార్మికులతో విధుల్లో ఉన్నవారిపై పని భారం పెరిగింది. నిపుణుత కలిగిన కార్మికులకు బదులు అవగాహన లేని కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించడం యజమాన్యం ఒక సంస్కృతి లా కొనసాగిస్తోంది . సమాన పనికి సమాన వేతనం చట్టం గాలికి వదిలారు. నేడు మృతుల్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న శాశ్వత కార్మికులు గుర్తింపునకు నోచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఉక్కు పరిశ్రమ శాస్త్రీయ నిర్వహణపై, భద్రత వైఫల్యాలపై కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు యజమాన్యం దృష్టికి తీసుకువచ్చినా నామ మాత్రపు చర్యలు జరిపి పరిశ్రమలు లాభాల బాటలో తీసుకురావడమే ప్రామాణికంగా యజమాన్యం పెట్టుకుంది. కార్మికుల విజ్ఞప్తులు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. స్టీల్ ప్లాంట్ మునగడకు ప్రధాన ముడిసరుకైనటువంటి సొంత గనుల కేటాయించడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధిని కార్మిక సంఘాలు ఎంత విమర్శించినా చలనం లేదు. కారణాలు ఏమైనప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ, మరో పరిశ్రమలో విలీనం చేస్తాం, ఇలా ఊగిసలాట మధ్య విశాఖ ఉక్కు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ లాభాలకు కష్టపడి పని చేసే కార్మికులను కుదిరించడం పై పెట్టిన శ్రద్ధ, ప్లాంట్ రక్షణ చర్యలు విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. యజమాన్యానికి లాభాల యావ, ఖర్చులు తగ్గించాలని తపన, కనీస భద్రత ప్రమాణాలను పాటించకపోవడంతో కార్మికులు బలిపశువులవుతున్నారు. కాస్టింగ్ మిషన్ వద్ద గతంలో 20 మంది నిపుణులు పనిచేసేవారు ఆ సంఖ్య క్రమంగా 13 నుంచి 12 కు తగ్గింది. అందులో ఎవరైనా కార్మికుడు సెలవు పెడితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ఉన్న తక్కువ మంది కార్మికులతోనే ప్లాంట్ నిర్వహణ యజమాన్యం సాగిస్తోంది. ఇటీవల ప్రభుత్వం 11 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇచ్చింది. అందులో కొంత భాగం పరిశ్రమ నిర్వహణకు విడిభాగాల ఆధునీకరణకు, కాలం చెల్లిన పరికరాలకు కేటాయించడంలో అశ్రద్ధ తో పాటు యజమాన్యం ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మత్తులతో ఫ్యాక్టరీ నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని విభాగాలు ఫ్యాక్టరీలో నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడం కొసమెరుపు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సర్వత్ రా దిగ్భ్రాంతి వ్యక్తంమైంది. కమిటీలు వేయడం, సమీక్షలు జరపటం ఎప్పటిలాగే జరుగుతున్నాయి. అయితే ప్రమాదాలకి కారణాలపై నిర్ధారణకు వచ్చినప్పుడు అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ యాజమాన్యం చూడాలి. అలాకాకుండా తాత్కాలిక చర్యలతో కాలం గడపడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నది సుస్పష్టం. అందువలన శాశ్వత పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఉండాలి. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలి, క్షతగాత్రులకు మేము ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. వెనుకబడిన ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు ఒక ఆశాదీపంగా వెలుగొందేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ఉండాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ స్ఫూర్తి వృధాకాకుండా, నామమాత్రపు ధరలకు వేలాది ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల త్యాగం నిర్లక్ష్యానికి గురి కాకూడదు.//

🌐 Select Language:
📰 ePaper