ఫీజు బకాయి… బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా భరత్ నగర్ కూరగాయల మార్కెట్‌లో వినూత్న నిరసన పాల్గొన్న రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ ఆగస్టు 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ కూరగాయల మార్కెట్‌లో ఫీజు బకాయి – బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన వినూత్న నిరసన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మార్కెట్‌లో కూరగాయలు విక్రయించడం, కూరగాయల బస్తాలు మోయడం, రోడ్లు ఊడవడం వంటి పనులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం వ్యాపారులు, కార్మికులు, ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ మొండి వైఖరిని వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.”రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేకుంటే మేమే మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతాం… బస్తాలు మోస్తాం… రోడ్లు ఊడుస్తాం… వాటితో వచ్చిన డబ్బును ప్రభుత్వానికి అందిస్తాం. కానీ పేద విద్యార్థుల భవిష్యత్తుతో మాత్రం చెలగాటం ఆడవద్దు” అంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.ప్రజల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారులు, కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.