రైతు వేదికలో వాతావరణ మార్పులు ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు*

August 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఆత్మ (ఎటీఎంఎ) ఆధ్వర్యంలో రైతు వేదికలో రైతులకు వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆలస్యంగా విత్తుటకు అనువైన పంటల ఎంపిక, సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులు ప్రమాద నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టీఆర్‌వీకే (టీ ఆర్ వి కే) ప్రధాన శాస్త్రవేత్త డా. ఈ. నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం పంపిణీ, ఉష్ణోగ్రతల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని, ఫలితంగా పంటల విత్తన సమయం మారుతున్నదని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు సూక్ష్మ సేద్య పద్ధతులు అవలంబించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేసి, సమతుల్య పోషక యాజమాన్యాన్ని పాటించాలని తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో ఆలస్యంగా విత్తే పరిస్థితుల్లో పప్పుధాన్య పంటలను తక్కువ వరుస దూరంతో సాగు చేయడం ద్వారా ఆశించిన మొక్కల సాంద్రతను సాధించి మెరుగైన దిగుబడులు పొందవచ్చని వివరించారు. అలాగే నానో ఎరువుల వినియోగం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు లీచింగ్ వాష్పీభవనం ద్వారా జరిగే పోషక నష్టాలు తగ్గుతాయని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ, నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రియ పదార్థాల వినియోగం, వర్షపు నీటి సంరక్షణ వంటి వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు.ఈ సందర్భంగా పరకాల వ్యవసాయ సహాయ సంచాలకులు ( ఎడీఎ) అవినాష్ వర్మ మాట్లాడుతూ రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా సమీకృత వ్యవసాయ విధానం పంటల వైవిధ్యీకరణ బహుళ పంటల సాగు విధానాలను అనుసరించడం ద్వారా వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. వ్యవసాయంతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, ఉద్యాన పంటల సాగు వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలు రైతుల ఆదాయాన్ని స్థిరపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మార్క ప్రియదర్శిని వ్యవసాయ విస్తరణ అధికారులు అన్వేష్, సానియా, అక్షర ఆత్మ బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ బీఎఫ్ఎసి సభ్యులు బొద్దుల మొగిలి, దుడిపాల నర్సింహారెడ్డి, గంగడి సుధాకర్ రెడ్డి, బాబు కొమురయ్య, బొమ్మకంటి కుమారస్వామి గ్రామ సర్పంచులు మడికొండ ఇంద్రరాజు, స్వరూప సుధాకర్ తో పాటు మండలంలోని పలువురు రైతులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper