యూరప్‌లో మానవతకే తొలి స్థానం… ఆమ్‌స్టర్‌డామ్–అల్మేరే జీవనశైలి ప్రత్యేకత
జనం న్యూస్ | జూలై 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : యూరప్ ఖండంలోని పలు దేశాల్లో మానవ సేవ, మానవత్వం, పరస్పర గౌరవానికి ఇచ్చే ప్రాధాన్యత విశేషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్–అల్మేరే ప్రాంత ప్రజల జీవన విధానం మానవతా విలువలకు అద్దం పడుతోంది. ఇక్కడ మతం కంటే మనిషికే ఎక్కువ గౌరవం ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ప్రాంతాల్లో దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నప్పటికీ, భారతదేశంలో కనిపించే విధంగా నిత్య ఆధ్యాత్మిక సందడి, భక్తుల రద్దీ, మైకుల హోరు లేదా భజనలు సాధారణంగా కనిపించవు. ఎక్కువగా ఆదివారం రోజున మాత్రమే ప్రార్థనా మందిరాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అయితే ఆ రోజు కూడా సెలవు దినం కావడంతో చాలామంది కుటుంబ సభ్యులతో గడపడం లేదా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతారు. దీంతో ప్రార్థనా మందిరాలను సందర్శించే వారి సంఖ్య పరిమితంగానే ఉంటుంది.అయితే ప్రజల నిత్య జీవితంలో మానవతా విలువలు ప్రతి అడుగులోనూ ప్రతిఫలిస్తాయి. ముఖ్యంగా రోడ్డు దాటే పాదచారులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడి ప్రత్యేక సంస్కృతి. కారు, బస్సు, ట్రామ్ వంటి వాహనాల డ్రైవర్లు పాదచారులను గమనించగానే వెంటనే వాహనాలను నిలిపి, మర్యాదపూర్వకంగా చేతితో సంకేతం చేస్తూ ముందుగా రోడ్డు దాటమని ఆహ్వానిస్తారు. ఇది కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాకుండా ప్రతి మనిషి పట్ల గౌరవాన్ని చాటే సామాజిక విలువగా నిలుస్తోంది.అలాగే ఈ ప్రాంతంలోని దేవాలయం, చర్చి, మసీదు సాధారణ రోజుల్లో ప్రశాంత వాతావరణంలో కనిపిస్తాయి. అవి కేవలం ప్రార్థనా స్థలాలుగా మాత్రమే కాకుండా మత సామరస్యం, పరస్పర గౌరవం, మానవతా విలువలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఆమ్‌స్టర్‌డామ్–అల్మేరే ప్రాంత జీవనశైలి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే సామాజిక సంస్కృతిని ప్రతిబింబిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.