
జనం న్యూస్, జులై, 28, జగిత్యాల జిల్లా, కోరుట్ల : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి సంబంధించిన 19 కీలక వినతిపత్రాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటిపై సమగ్రంగా చర్చించారు.ప్రస్తుతం కోరుట్ల ఏరియా ఆసుపత్రి, మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సహా నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులను బదిలీ చేయకుండా కొనసాగించాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పటికే వైద్యుల కొరతతో ప్రజలకు వైద్య సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులను బదిలీ చేస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని వివరించారు. ఖాళీ పోస్టులను కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.కోరుట్ల ఏరియా ఆసుపత్రికి ENT, ICU, SNCU, ఆపరేషన్ థియేటర్, ఆర్థోపెడిక్, సర్జికల్ పరికరాలు, అలాగే మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి OT హైడ్రాలిక్ టేబుల్స్, OT ల్యాంపులు, Boyle's Apparatus, 600 LPM PSA ఆక్సిజన్ జనరేటర్, 60 KV జనరేటర్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను అత్యవసరంగా మంజూరు చేయాలని కోరారు.అదేవిధంగా కోరుట్ల ఏరియా ఆసుపత్రి, మెట్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్, సాంకేతిక, పరిపాలనా సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోరుట్ల ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బందిని 34 నుంచి 55 మందికి, మెట్పల్లి ఆసుపత్రిలో 31 నుంచి 54 మందికి పెంచాలని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.కోరుట్ల 100 పడకల ఏరియా ఆసుపత్రికి అవసరమైన క్యాడర్ స్ట్రెంగ్త్‌ను పెంచడంతో పాటు, మెట్పల్లి 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అదనపు వైద్య, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థ, రెండు బోర్వెల్లు, కొత్త ఆసుపత్రి భవనం ప్రారంభానికి అవసరమైన బెడ్లు, పరికరాలు, ల్యాబ్ సౌకర్యాలు, మందులు, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కోరుట్ల నియోజకవర్గంలోని 17 ఆరోగ్య ఉపకేంద్ర భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అదనపు నిధులు మంజూరు చేయాలని, అలాగే కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐలాపూర్ పీహెచ్‌సీపై అధిక భారం పడుతుండటంతో గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.మంత్రి దామోదర రాజనర్సింహ కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.