జనం న్యూస్ సెప్టెంబర్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి సృజనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని స్థానిక కాలనీలు, హెచ్‌పీ రోడ్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇరుకైన రోడ్ల కారణంగా వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, ప్రధాన రహదారులపై వర్షపు నీరు, మురుగు నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో ఏర్పడుతున్న సమస్యలను వివరించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే గతంలో భరత్ నగర్ కాలనీలో నిర్వహించిన ‘వన్ డే–వన్ వార్డు’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్న సందర్భంగా స్థానికులు వివరించిన సమస్యలను కూడా మరోసారి ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య, తాగునీటి సరఫరా, ఓవర్‌హెడ్ ట్యాంక్ మరమ్మతులు వంటి అంశాలను ప్రస్తావించారు. భరత్ నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోందని తెలిపారు. ముఖ్యంగా మెట్రో రైలు ప్రాంతానికి వెళ్లే మార్గంలో రద్దీ కారణంగా స్థానిక ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, భరత్ నగర్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కమిషనర్‌ను కోరారు.