నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపట్టొద్దని తీర్మానం జనం న్యూస్, సెప్టెంబర్ 30 | జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, యామాపూర్: యామాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అంకతి రాజన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ పాలకవర్గం పదవీకాలం పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై సభ్యులు చర్చించారు. సహకార సంఘానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి నూతన పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని సమావేశంలో తీర్మానించారు. ఎన్నికలు నిర్వహించడంలో మరింత జాప్యం జరిగితే, గతంలో సంఘ సభ్యులచే ఎన్నికైన పాలకవర్గాన్నే కొనసాగించాలని కోరారు. అయితే నామినేటెడ్ పద్ధతిలో ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులను పాలకవర్గంలో నియమించవద్దని సంఘ సభ్యులు, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, సంఘ సభ్యుల హక్కులను కాపాడేందుకు ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షులు అంకతి రాజన్న, సభ్యులు భాస్కర్, ఆరె గంగారెడ్డి, పట్నం నరసయ్య, అన్నారం రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.