పైడిమడుగు, అయిలాపూర్, యూసుఫ్‌నగర్ పాఠశాలల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పర్యటన
జనం న్యూస్, అక్టోబర్ 5, జగిత్యాల జిల్లా : కోరుట్ల 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థి ఇప్పటి నుంచే నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉన్నత ఫలితాలు సాధించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు.కోరుట్ల మండలంలోని పైడిమడుగు, అయిలాపూర్, యూసుఫ్‌నగర్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సందర్శించారు. ఆయా పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి చదువు, పరీక్షల సన్నద్ధత, పాఠశాలలోని విద్యా వాతావరణం, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. వారి చదువు తీరును, ఏయే సబ్జెక్టుల్లో ఆసక్తి ఉందో, పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఉపాధ్యాయులతో చర్చించి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు.పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళిక అవసరం 10వ తరగతి పరీక్షలను భారంగా భావించకుండా, ఒక అవకాశంగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతిరోజూ చదువుకు కొంత సమయం కేటాయించి, పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడంతో పాటు మోడల్ పేపర్లు, గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం క్రమశిక్షణతో కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు భరోసా కల్పించారు. పరీక్షల సమయంలో సమయపాలన ఎంతో ముఖ్యమని, ప్రతి సబ్జెక్టుకు తగిన ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలని సూచించారు.చదువుతో పాటు నైపుణ్యాల పెంపొందింపు విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా చదువుతో పాటు క్రమశిక్షణ, కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించే సూచనలను గౌరవిస్తూ వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, ఆ లక్ష్యాలను సాధించే వరకు పట్టుదలతో కృషి చేయాలని డాక్టర్ సంజయ్ ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై కూడా ఎమ్మెల్యే సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించారు.