జనం న్యూస్ అక్టోబర్ 5 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్) ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ ప్రాంతం నుంచి విపరీతమైన దుర్వాసన వెలువడుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం సూరారం గ్రామానికి చెందిన ప్రజలు ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్యాస్ దుర్వాసన కారణంగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, దగ్గు, తుమ్ములు, ఆయాసం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళల్లో దుర్వాసన మరింత తీవ్రంగా ఉండటంతో ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.దుర్వాసన తీవ్రత కారణంగా ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దుర్వాసనకు అసలు కారణాలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే దుర్వాసనకు కారణమవుతున్న కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, సమస్యను పూర్తిగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న వాయువులపై కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, నిబంధనలను పాటిస్తున్నారో లేదో పరిశీలించాలని కోరారు.గ్యాస్ ప్లాంట్ యాజమాన్యం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా, పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని గ్రామస్తులు సూచించారు. ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి లో సమర్పించిన వినతిపత్రంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.