జనం న్యూస్ అక్టోబరు 8 కోటబొమ్మాళి: మండల కొత్తమ్మతల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లను మంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు, క్యూలైన్లు, విద్యుత్ అలంకరణలు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.తొలుత మంత్రి శ్రీ కొత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జాతర మహోత్సవాలకు సంబంధించిన గొడపత్రికను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లపై ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. క్యూలైన్లు ఏర్పాటు చేసినప్పటికీ సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూలైన్ల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి ప్రధాన రహదారిపై విద్యుత్ అలంకరణల కోసం చేపడుతున్న పనులను మంత్రి పరిశీలించారు. రాజగోపురం సమీపం నుంచి ప్రధాన రహదారి మీదుగా భక్తులు సులభంగా ఆలయానికి చేరుకునేలా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు.జాతర సందర్భంగా ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో పాటు, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.జాతర ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, దేవాదాయ ధర్మాదాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, జాతర మహోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ , రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిన రమేష్, కొత్తమ్మ తల్లి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోరాడ గోవిందరావు, దేశం మండల పార్టీ అధ్యక్షుడు బోయిన సత్య శ్రీనివాస్, లో తాసిల్దార్ సి.హెచ్.ఎస్. వి. కే. ప్రసాద్ రావు, ఎం. పీ. డీ. వో కిల్లారి నారాయణరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.