పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారులు, సెంట్రల్ లైటింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి జనం న్యూస్ | అక్టోబర్ 15: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల పరిధిలోని పలు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల పరిధిలోని తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాల్లో పుష్కర ఘాట్లకు అదనపు ఘాట్లు నిర్మించాలని, ఘాట్ల మరమ్మతులకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ఏర్గట్ల మండల కేంద్రంలో మిగిలిపోయిన తాళ్లరాంపూర్ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, పాలెం నుంచి తొర్తి మీదుగా ఏర్గట్ల వరకు డబుల్ డాంబరు రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, తాడ్పాకల్ గ్రామం నుంచి పుష్కర ఘాటు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై స్పందించిన మంత్రి సీతక్క సంబంధిత శాఖల మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు లేఖలు అందజేసి, సమస్యల పరిష్కారంపై వారితో మాట్లాడారు. ఏర్గట్ల మండల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఆయా మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, తొర్తి సర్పంచ్ కౌడ భూమేష్, గుమ్మిర్యాల్ సర్పంచ్ సంజీవ్ యాదవ్, తాడ్పాకల్ సర్పంచ్ జింక అనిల్ యాదవ్, దోంచంద ఉపసర్పంచ్ ఆశిరెడ్డి హన్మంత్రెడ్డి, ఏర్గట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పన్నాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.