ఆంధ్రప్రదేశ్

246 పెన్షన్లు కట్.. 108 కొత్త పెన్షన్లతో సంబరాలా?-

246 పెన్షన్లు కట్.. 108 కొత్త పెన్షన్లతో సంబరాలా?-

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం విమర్శ జనం న్యూస్, నవంబర్ 19 : నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండలం:
కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో గొప్పలు చెప్పుకోవడం తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజపూర్ణానందం విమర్శించారు. ఏర్గట్ల మండలంలో పెన్షన్లకు సంబంధించిన వాస్తవ లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటాన్ని బయటపెడుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాజపూర్ణానందం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్గట్ల మండలంలో 3,636 మందికి పెన్షన్లు అందేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2026 నాటికి ఆ సంఖ్యను 3,390కి తగ్గించిందని తెలిపారు. దీంతో 246 మంది పేదల పెన్షన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్తగా 354 మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, గతంలో తొలగించిన 246 పెన్షన్లను మినహాయిస్తే అదనంగా పెరిగింది కేవలం 108 పెన్షన్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లకు సైతం పాత రూ. 2,000 మొత్తాన్నే అందిస్తున్నారని విమర్శించారు. పెన్షన్ల పేరుతో పండుగలు నిర్వహించడం, మంత్రుల సమావేశాలు, మండల స్థాయిలో అధికారులు, కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాధనాన్ని ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు నిజంగా మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే తొలగించిన 246 మంది పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 246 మంది పేదల పెన్షన్లు తొలగించి, కేవలం 108 అదనపు పెన్షన్లు ఇచ్చి పండుగలు చేసుకోవడమేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మార్పు? అని రాజపూర్ణానందం ప్రశ్నించారు. పెన్షన్ల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా, అర్హులైన ప్రతి పేదవారికి న్యాయం చేయాలని, పెన్షన్ మొత్తాన్ని పెంచి పేదలకు అండగా నిలవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ గుళ్ళే రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ జక్కం మధుసూదన్, లోలపు అశోక్, మోర్తాడ్ మండల అధ్యక్షుడు ఏలీయా నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్