జనం న్యూస్ మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇన్చార్జ్ తేదీ 20/11/2026 మట్టితో ఇటుకలు తయారు చేస్తూ నిత్యం శ్రమించే కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని, కష్టపడి పనిచేసే కార్మికులు కనీస వసతులు లేని ప్లాస్టిక్ గుడిసెల్లో జీవనం సాగిస్తుంటే, అదే మట్టితో ఇటుకలు తయారు చేసి విక్రయించే కంపెనీల యజమానులు మాత్రం అద్దాల మేడల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటుక బట్టీల పేరుతో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్న యజమానులు వారి సంక్షేమం, నివాస సౌకర్యాలు, కనీస హక్కుల విషయంలో తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటుక బట్టీలు, కంపెనీలపై సంబంధిత మైనింగ్, రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలి. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ప్లాస్టిక్ గుడిసెల్లో జీవనం సాగిస్తున్న కార్మికులకు కనీస వసతులు కల్పించి, వారి శ్రమకు తగిన గౌరవం, న్యాయమైన వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.