జనం న్యూస్ నవంబర్ 20 : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రం లో గురువారం మంత్రి దనసరి అనసూయ సీతక్కపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఒక మహిళా మంత్రిగా, గిరిజన బిడ్డగా సామాన్య స్థాయి నుంచి తన కష్టంతో ఎదిగి రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్న సీతక్కపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
మహిళా నాయకురాలిని, గిరిజన సమాజానికి చెందిన ప్రజాప్రతినిధిని గౌరవించాల్సిన కనీస సంస్కారం లేకుండా ‘మంత్రికి సిగ్గులేదా’ అంటూ మాట్లాడటం ఆయన రాజకీయ స్థాయిని తెలియజేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయవచ్చని, కానీ వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. సీతక్క రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని, అలాంటి నాయకురాలిని అవమానించేలా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించబోవని హెచ్చరించారు. ప్రశాంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ప్రజలు తీవ్రంగా పరిగణిస్తారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘ప్రశాంత్ రెడ్డి ఖబడ్దార్’, ‘నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.