అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం జనం న్యూస్ నవంబర్ 23:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టు ఒకటి ఖాళీగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరిగిరి కృష్ణాచారి తెలిపారు. ఈ పోస్టు భర్తీ కోసం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక విద్యలో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. బీఈడీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ప్రత్యేక విద్యలో డీఈడీ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి ఒక పోస్టు మాత్రమే ఖాళీగా ఉండగా, ఐదు నెలల కాలపరిమితితో నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.16,500 వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు దరఖాస్తును ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరిగిరి కృష్ణాచారికి సమర్పించాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు కోరారు.