మంగళవారం, సెలవు దినం కావడంతో ఉదయం నుంచే బారులు తీరిన భక్తజనం ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్న మహిళలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు జనం న్యూస్ 24 నవంబర్ వికారాబాద్ జిల్లా :- కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పరిగి సమీపంలోని ప్రసిద్ధ శ్రీ లొంక హనుమాన్ దేవాలయం మంగళవారం భక్తజనసంద్రంగా మారింది. ఒకవైపు పవిత్రమైన కార్తీక పౌర్ణమి, మరోవైపు ఆంజనేయస్వామికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం, దీనికి తోడు సెలవు దినం కూడా కలిసిరావడంతో పరిగి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ఉదయం నుంచే కుటుంబ సమేతంగా ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి విశిష్టతను పురస్కరించుకుని మహిళా భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడి, నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని కళకళలాడింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చినప్పటికీ, దర్శనంలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. దర్శనం అనంతరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్ల పట్ల, స్వామివారి దర్శనం సౌకర్యవంతంగా కలగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.