ఆర్‌బి రెస్టారెంట్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ.. ఆహార భద్రత చట్టం కింద కేసు నమోదు
జనం న్యూస్, జూలై 20, జగిత్యాల జిల్లా,మెట్‌పల్లి : పట్టణంలోని ఆర్‌బి (RB) రెస్టారెంట్‌లో ఆహార నాణ్యతపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బి. అనూష సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం–2006 సెక్షన్ 54 కింద రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, ఆదివారం మధ్యాహ్నం పట్టణానికి చెందిన కరుణాకర్ తన కుటుంబంతో కలిసి ఆర్‌బి రెస్టారెంట్‌లో బిర్యానీ తినేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా తన రెండేళ్ల కుమారుడు తింటున్న బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, నిర్లక్ష్యపూరిత సమాధానం లభించిందని ఆయన ఆరోపించారు.దీంతో జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారి బి. అనూష సోమవారం రెస్టారెంట్‌ను తనిఖీ చేసి, ప్రాథమిక పరిశీలన అనంతరం ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం–2006 సెక్షన్ 54 ప్రకారం కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లపై ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఫిర్యాదుదారులు పని దినాల్లో నేరుగా తమను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.