విద్యార్థులు సైబర్ నేరాలు, మహిళా చట్టాలు, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి :

July 20, 2026 | వైరల్ వార్తలు


జనం న్యూస్ జూలై 20 (ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)కాట్రేనికోన, కోనసీమ జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసు అధికారి (జిల్లా ఎస్పీ) మీనా ఆదేశాల మేరకు, అమలాపురం ఉప విభాగ పోలీసు అధికారి (డి.ఎస్.పి) టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ పర్యవేక్షణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన ఉప పోలీసు అధికారి అవినాష్ పాల్గొని సైబర్ నేరాలు, మహిళా చట్టాలు, పొక్సో చట్టం, రోడ్డు భద్రత, మరియు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.సైబర్ నేరాలపై మాట్లాడుతూ సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని ఉప పోలీసు అధికారి హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.రోడ్డు భద్రత గురించి మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపకూడదని, రహదారి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. హెల్మెట్ ధరించడం మరియు అతివేగాన్ని నియంత్రించుకోవడంపై అవగాహన కల్పించారు.మహిళలు మరియు చిన్నారుల రక్షణపై మాట్లాడుతూ వారి భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల గురించి, పొక్సో చట్టం గురించి విపులంగా వివరించారు. ఏదైనా ఆపద కలిగితే ‘100’ లేదా ‘112’ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ‘మంచి స్పర్శ – చెడు స్పర్శ’ పట్ల చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు(హెచ్ఎం) ఆర్ అంబ, ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper