ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బీఆర్ఎస్ నేతలు.. జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కీలక రహదారి ప్రాజెక్టులపై వినతులు

July 24, 2026 | వైరల్ వార్తలు

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసిన ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్.

జహీరాబాద్–బీదర్ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి, నాలుగు లేన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి.

పెరుగుతున్న పారిశ్రామిక, వాహన రద్దీ దృష్ట్యా జహీరాబాద్ -సంగారెడ్డి (NH-65)ని ఆరు లేన్లుగా మార్చాలని వినతి.

కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద ప్రతిపాదించిన ఫ్లైఓవర్/అండర్‌పాస్‌ను 30 మీటర్లకు పొడిగించి, సర్వీస్ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదన.

జనం న్యూస్ 24-07-2026జహీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చే కీలక రహదారి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ నేతలు కోరారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన ఛాంబర్‌లో కలిసి వివిధ అభివృద్ధి ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన అంశాలు…జహీరాబాద్-బీదర్ రోడ్డు ‘జాతీయ రహదారి’గా గుర్తింపుతెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ జహీరాబాద్–బీదర్ రాష్ట్ర రహదారిని వెంటనే జాతీయ రహదారి గా ప్రకటించి, నాలుగు లేన్లుగా విస్తరించాలని నేతలు కోరారు. న్యాల్కల్ మండలంలో నిమ్జ్ , జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఇతర లాజిస్టిక్స్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రతిరోజూ 2 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని మంత్రికి వివరించారు.జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం బీదర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతమున్న రెండు లేన్ల రోడ్డు ట్రాఫిక్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తే.. అత్యవసర వైద్య సేవలు వేగవంతం కావడంతో పాటు, రవాణా ఖర్చులు తగ్గి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు.జహీరాబాద్–సంగారెడ్డి (NH-65) ఆరు లేన్లుగా విస్తరణహైదరాబాద్‌కు ప్రధాన అనుసంధాన మార్గమైన జహీరాబాద్-సంగారెడ్డి జాతీయ రహదారిని NH-65 ప్రస్తుతమున్న నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మా, ఆటోమొబైల్ పరిశ్రమలతో జహీరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారీ సరుకు రవాణా వాహనాలు, కంటైనర్లతో ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. అంబులెన్స్‌లు, అత్యవసర వైద్య సేవలకు కూడా ఇది కీలక రహదారి అని, ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణ ఆలస్యాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రహదారిని ఆరు లేన్లుగా మారిస్తే.. ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు లాజిస్టిక్స్ సామర్థ్యం పెరిగి సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రితో అన్నారు.దిగ్వాల్ వద్ద 30 మీటర్ల ఫ్లైఓవర్/అండర్‌పాస్ నిర్మాణంజాతీయ రహదారిపై కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామం వద్ద ప్రతిపాదించిన 25 మీటర్ల ఫ్లైఓవర్/అండర్‌పాస్‌ను 30 మీటర్లకు పొడిగించాలని నాయకులు కేంద్ర మంత్రికి విన్నవించారు. దాదాపు 10 గ్రామాలకు ప్రధాన రాకపోకల మార్గమైన ఇక్కడ, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు 25 మీటర్ల పొడవు ఏమాత్రం సరిపోదని వివరించారు. జీఎంఆర్ కళాశాల విద్యార్థులు, రైతులు, ఉద్యోగుల భద్రత కోసం దీనిని 30 మీటర్లకు విస్తరించాలని కోరారు. అలాగే జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు, వర్షపు నీరు నిలవకుండా స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రజల కోసం బస్ షెల్టర్లు నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.జహీరాబాద్ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా భద్రత, రవాణా సదుపాయాల మెరుగుదలను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సావధానంగా విన్నారు. ఈ రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఒక ప్రకటనలో వెల్లడించారు.

🌐 Select Language:
📰 ePaper