వృక్షో రక్షతి రక్షతః – పచ్చని కూకట్‌పల్లి, హరిత హైదరాబాద్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: బండి రమేష్
జనం న్యూస్ జులై 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నగరం పచ్చటి హరితవనంగా మారాలని, ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వనమహోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక సంవత్సరంలో 16 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వ నర్సరీల ద్వారా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రోజు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వసంతనగర్ డివిజన్ గోపాలనగర్ కాలనీ పార్కు వద్ద హెచ్‌ఎండీఏ డైరెక్టర్ రోహిత్ అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణి సహకారంతో, మందలపు రోజారమణి ట్రస్ట్ నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిబాబా చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ మొక్కలు నాటి, కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ కనీసం నాలుగైదు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షిస్తేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలం. వృక్షాలను కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడినట్టే. ‘వృక్షో రక్షతి రక్షతః’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలి” అని అన్నారు.
పిల్లల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని, ప్రతి కుటుంబం మొక్కల పెంపకాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన సూచించారు.ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాన్ని చేపట్టిన సాయిబాబా చౌదరిని అభినందించిన బండి రమేష్ ఈ స్ఫూర్తితో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ విస్తృతంగా మొక్కల నాటే కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక నాయకులను కోరారు.ఈ కార్యక్రమంలో వసంతనగర్, కేపీహెచ్‌బీ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసబాబు, అరవింద్ రెడ్డి, రంగమోహన్, శివ, ప్రవీణ్, రామకృష్ణ, సత్యనారాయణ, రామారావు తదితర స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.