జనం న్యూస్ కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు.. 12వ వార్డు అర్బన్ కాలనీలో వీధి కుక్కల పట్టివేత

July 25, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్,జూలై 25, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: పట్టణంలోని 12వ వార్డు అర్బన్ కాలనీలో వీధి కుక్కల బెడదపై జనం న్యూస్ ప్రచురించిన కథనానికి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులతో పాటు వార్త ప్రచురితమైన నేపథ్యంలో శనివారం మున్సిపల్ సిబ్బంది కాలనీలో ప్రత్యేకంగా పర్యటించి వీధి కుక్కలను పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.ఇటీవలి కాలంలో అర్బన్ కాలనీలో వీధి కుక్కల సంఖ్య పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు కుక్కలు ప్రజలపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సమస్యను జనం న్యూస్ ప్రజా సమస్యగా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించి చర్యలు ప్రారంభించారు.మున్సిపల్ సిబ్బంది కాలనీలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను ప్రత్యేక వాహనంతో పట్టుకుని తరలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కుక్కల బెడదను నియంత్రించేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తామని, అవసరమైన చోట మరిన్ని ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడం పట్ల అర్బన్ కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో పట్టణంలోని ఇతర వార్డుల్లో కూడా వీధి కుక్కల సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు.ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అలాగే కుక్కల జనాభా నియంత్రణ, టీకాల కార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలని స్థానికులు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper