డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

July 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, నిరుపేదలకు అందాల్సిన ఇళ్లను మంత్రులు, కలెక్టర్లు, అధికారుల అనుచరులకు కేటాయించారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము సేకరించిన ఆధారాలను మీడియా ముందుంచుతున్నట్లు తెలిపారు.దేశంలో ప్రజలను నిత్యం మోసం చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించిన ఎమ్మెల్యే, ఖైతలాపూర్‌లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 145 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నాలా పక్కన నివసిస్తున్న అమృత్‌నగర్ తండా నిరుపేదలకు కేటాయించాలని అప్పట్లో డిమాండ్ చేశామని గుర్తు చేశారు. నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా తాము కృషి చేశామని చెప్పారు.నిరుపేద జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.
ఇళ్ల కేటాయింపుల్లో అధికారుల పైరవీలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ సిఫారసుతో ఒకరికి, హైదరాబాద్–రంగారెడ్డి కలెక్టర్ సిఫారసుతో మరొకరికి, ఖమ్మంలో నివసిస్తున్న ఓ మహిళకు కూకట్‌పల్లిలో డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించారని ఆరోపించారు. అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ సిఫారసుతో ఒకరికి, కుత్బుల్లాపూర్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రత్యూషకు కూడా ఇల్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పైరవీతో నరేష్ కుమార్‌కు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పేరుతో మరో కేటాయింపు జరిగినట్లు ఆరోపిస్తూ, మంత్రులు, కలెక్టర్లు సిఫారసు లేఖలతో ఇళ్ల కేటాయింపులు జరగడం ప్రజాపాలనకు విరుద్ధమని ప్రశ్నించారు.
నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లను అర్హులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఎమ్మెల్యే, ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహిళల పేరుమీద మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రస్తుతం పురుషుల పేర్లతో కూడా రిజిస్ట్రేషన్లు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా, ఎలాంటి దరఖాస్తులు చేయని వ్యక్తులకు కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.ఇళ్ల కేటాయింపుల పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పైరవీ లేఖల ఆధారంగా ఇళ్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. దరఖాస్తుల పేరుతో రూ.పది వేల వరకు వసూలు చేస్తున్నారని, మరికొందరిని రూ.6.50 లక్షలు చెల్లిస్తే ఇల్లు కేటాయిస్తామని ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. అంత మొత్తాన్ని నిరుపేదలు ఎలా చెల్లించగలరని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందించామని పేర్కొన్నారు.మేడ్చల్ జిల్లా కలెక్టర్ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అవినీతిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్పందించడం లేదని అన్నారు. అక్రమ కేటాయింపులు కొనసాగితే హైకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.

🌐 Select Language:
📰 ePaper