భారీ వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ ధర్మపురి అర్వింద్

July 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూలై 29, జగిత్యాల జిల్లా: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన బుధవారం చరవాణి ద్వారా కలెక్టర్‌తో మాట్లాడి పలు సూచనలు చేశారు.మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, వాటర్ సప్లై, విద్యుత్, ఆర్ అండ్ బీ (R&B), జాతీయ రహదారుల సంస్థ (NHAI)తో పాటు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల బలహీనంగా ఉన్న కట్టలపై ప్రత్యేక దృష్టి సారించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిత్యావసర వస్తువులు, స్వచ్ఛమైన తాగునీరు, వైద్య సేవలు తదితర అత్యవసర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రజలను ఉద్దేశించి, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలను దాటేందుకు ప్రయత్నించవద్దని, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

🌐 Select Language:
📰 ePaper