భారీ వర్షాలతో అప్రమత్తమైన 14వ వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష–నవీన్.. ఇండ్లలోకి చేరిన నీటిని తొలగించి ప్రజలకు భరోసా
జనం న్యూస్ | జూలై 30 | జగిత్యాల జిల్లా, మెట్పల్లి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్ల మధ్యలోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే 14వ వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష, నవీన్ దంపతులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.వర్షపు నీరు నిలిచిపోవడానికి కారణమైన డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా చేతులతో తొలగించి, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో నిల్వ ఉన్న వర్షపు నీరు బయటకు వెళ్లి స్థానికులకు కొంత ఉపశమనం లభించింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ ధోనికెల శిరీష–నవీన్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు నీటితో నిండిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే తనకు లేదా మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.వర్షాల ప్రభావంతో డ్రైనేజీలు మూసుకుపోవడం, నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎక్కడ కనిపించినా వెంటనే పరిష్కరించే లా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.కష్టసమయంలో ప్రజల మధ్యకు వచ్చి స్వయంగా డ్రైనేజీల్లోని చెత్తను తొలగిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టిన ధోనికెల శిరీష–నవీన్ దంపతుల తీరును వార్డు ప్రజలు అభినందించారు. ప్రజలకు అండగా నిలుస్తూ వెంటనే స్పందించిన వారి సేవాభావానికి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.