భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS
జనం న్యూస్ 30 జూలై వికారాబాద్ జిల్లా :- రాబోయే 48 గంటల పాటు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, వికారాబాద్ జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS తెలిపినారు. జిల్లాలో అందరూ పోలీసు అధికారులు, సిబ్బంది 24×7 అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశం. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితులకు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచన. రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని ఆదేశం.అంబులెన్సులు, వైద్యులు, సహాయక బృందాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన. వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు ఉద్ధృతంగా ప్రవహిస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరిక. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వవద్దని సూచన. పాత ఇండ్లలో నివసించే కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని, శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని సూచన. రోడ్లపై నీరు నిల్వ ఉండటం, గుంతలు కనిపించక పోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచన.
గ్రామ సర్పంచ్‌లు, ఇతర శాఖల అధికారులతో కలిసి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు ఆదేశం.ప్రమాదకర వాగులు, కల్వర్టులు, వరద ముంపు ప్రాంతాల వద్ద రోడ్డు బ్లాక్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ గారి సూచన. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, ట్రాఫిక్ మళ్లించడం, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం.ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ గారు తెలిపారు.అత్యవసర సహాయం అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100 లేదా వికారాబాద్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ – 8712670056 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS ప్రజలకు తెలియజేయడం జరిగింది.