నాలుగు దశాబ్దాల విద్యా సేవలకు గుర్తింపుగా దామెర సుధాకర్‌కు ఘన సన్మానం
జనం న్యూస్ , జులై 31( జిల్లా ఇంచార్జ్ )జమ్మికుంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా (హెచ్‌ఎం) విశిష్ట సేవలందించిన దామెర సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. విద్యార్థుల అభ్యున్నతి, క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు, అభిమానులు కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, భవిష్యత్తులోనూ సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ వాసల రామస్వామి, సుంకరి యాదయ్య, పాంతటి రవీందర్, ఎం.ఏ. రషీద్, కొంగల కుమార్, మారేపల్లి అజయ్ పాల్గొని దామెర సుధాకర్‌ను ఘనంగా సన్మానించి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వాసాల రామస్వామి మాట్లాడుతూ , ఒక ఉపాధ్యాయుడి సేవలు పాఠశాల గోడలకే పరిమితం కావని, మంచి విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. దామెర సుధాకర్ సేవలు జమ్మికుంట ప్రాంత విద్యా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయని కొనియాడారు. ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని ఈ సందర్బంగా ఆకాంక్షించారు.