అవినీతి, మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరభేరి

September 2, 2026 | తెలంగాణ

ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ కోరుట్లలో బీఆర్ఎస్ భారీ ధర్నా420 అడుగుల హామీల ఫ్లెక్సీతో రోడ్ ప్రదర్శన

జనం న్యూస్, సెప్టెంబర్ 2, జగిత్యాల జిల్లా : కోరుట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా, రోడ్ ప్రదర్శన చేపట్టారు.ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, కోరుట్ల బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రోడ్ ప్రదర్శన నిర్వహించారు.భారీ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రదర్శిస్తూ, వాటిలో ఎన్ని అమలయ్యాయి, ఇంకా ఎన్ని హామీలు నెరవేరాల్సి ఉందనే విషయాలను ప్రజలకు వివరించేలా ప్రదర్శన నిర్వహించారు. భారీ ఫ్లెక్సీతో సాగిన ఈ రోడ్ ప్రదర్శన ప్రజల దృష్టిని ఆకర్షించింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడిచినా ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ పోరాటం చేపట్టామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ధర్నా అనంతరం నిర్వహించిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీ రోడ్ ప్రదర్శనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper