వైభవంగా జనహృదయ నేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

September 2, 2026 | ఆంధ్రప్రదేశ్

సేవా కార్యక్రమాలతో ఉప ముఖ్యమంత్రి జన్మదినాన్ని సార్థకం చేసిన కూటమి శ్రేణులు
జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనల మేరకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజా సేవలో ఆయన మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌దని అన్నారు. రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజా సేవకు వేదికగా మార్చిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు.జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, నిస్వార్థ సేవతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. యువతలో సామాజిక చైతన్యం నింపుతూ, బాధ్యతాయుతమైన రాజకీయాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారని తెలిపారు.ఏఎంసి చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత, మానవతా దృక్పథం, సేవా తపన కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం జన్మదిన వేడుకల సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలను వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని సార్థకం చేయడం విశేషంగా నిలిచింది.అనంతరం స్థానిక ఏరియా ఆసుపత్రిలో జనసేన నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం మహాదానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి జీవదానంగా నిలుస్తుందని పేర్కొంటూ యువత పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవిల్లి శివ, నియోజకవర్గంలోని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ప్రజా సేవలో మరిన్ని మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper