జనం న్యూస్, సెప్టెంబర్ 12,అచ్యుతాపురం : భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని అచ్యుతాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈరోజు జరిగిన సంతాప సభలో కామ్రేడ్ ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ సీతారాం ఏచూరి తెలుగు బిడ్డగా పుట్టి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు. 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించిన ఆయన, జెఎన్ యు విద్యార్థి ఉద్యమం నుండి ఎదిగి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి, 1975లో సిపిఐ(ఎం)లో చేరారు. 1984లో కేంద్ర కమిటీకి, 1992లో పొలిట్ బ్యూరోకు ఎన్నికై, 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వం విశాఖ గడ్డ మీదే ప్రారంభం కావడం మనందరికీ గర్వకారణం. రాజ్యసభ సభ్యుడిగా (2005-2017) ఆయన చేసిన ప్రసంగాలు, మతతత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయడానికి చేసిన కృషి చిరస్మరణీయమని,పార్టీలకు అతీతంగా అందరితో స్నేహంగా ఉంటూనే, సిద్ధాంతంలో రాజీలేని కమ్యూనిస్టుగా నిలిచారని,12 సెప్టెంబర్ 2024న తుదిశ్వాస విడిచే వరకు, చివరి క్షణం వరకు ప్రజల కోసం పనిచేసిన ఆయన, తన దేహాన్ని కూడా ఏయిమ్స్ కు దానం చేసి, తన ఆదర్శాన్ని చాటుకున్నారని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు పి నాయుడు, కార్మిక యువజన, విద్యార్థి సంఘాల సభ్యులు పాలికల అప్పలరాజు, రెడ్డి అప్పలనాయుడు, రాజన్న అప్పలకొండ, లాలం రామ్ నాయుడు,రాజాన సత్తిబాబు, దొడ్డి నాగరాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.