జనం న్యూస్ -సెప్టెంబర్ 13- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో త్రాగునీటి సమస్య అధికంగా ఉండటంతో పాటు పలు వార్డులలో త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పైలాన్ కాలనీ వాటర్ సప్లై ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించి వాటర్ సప్లై ఏఈ రమేష్ కు వినతి పత్రం అందించారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కృష్ణానది నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు ప్రజల అవసరాలకు నీటిని రోజు తరలిస్తున్న, చెంతనే కృష్ణానది ఉన్న సాగర్ ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందించలేక పోతున్నారని, పైలాన్ కాలనీలలోని పలు వార్డులలో10 నుంచి 12 కుటుంబాలకు ఒకటే పబ్లిక్ నల్ల ఉండటం వల్ల అవసరాలకు సరిపడా నీరు అందటం లేదని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు రెండు గంటలు నీటి సరఫరా చేయగా ప్రస్తుతం రెండు రోజులకి ఒకసారి ఒక గంట మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని దీనివల్ల ప్రజలు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి అన్ని వార్డులకు ప్రతిరోజు సురక్షితమైన త్రాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు హిరేకర్ రమేష్ జి, నకిరేకంటి సైదులు, మహమ్మద్ గని, యల్ల ఆనంద్ విజయ్, మక్సుద్, ఆదాసు విక్రమ్ , లక్ష్మణ్ నాయక్, అర్జున్ నాయక్, శివ, బహదూర్, బండారు లక్ష్మీనారాయణ,శేఖరా చారి, నసీర్ ,మంద శాంతకుమారి, మన్సూర్, కాజా, హమీద్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.